Delhi Pollution: దిల్లీలో బాగా తగ్గిన గాలి నాణ్యత.. 400 దాటిన ఏక్యూఐ
దేశరాజధాని దిల్లీపై దట్టమైన పొగమంచు వదలకుండా ఉంది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈరోజు (బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 339గా నమోదైంది. చలి వాతావరణం కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా దృష్టిపాతం తగ్గి ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం
దిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత మరింతగా దిగజారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ప్రకారం, బుధవారం కూడా దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' స్థాయిలోనే ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే AQI 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో కాలుష్యం ఉన్నట్లుగా పరిగణించబడుతుంది, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మరింత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
సచివాలయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లు
CPCB వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం 7:30 గంటలకు ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదయింది, ఇది కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలోనే ఉంది. సోమవారం ఈ AQI 347గా నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్, ఢిల్లీ సచివాలయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు. చలి సమయంలో మంటలు వేయడం వల్ల కాలుష్యం పెరిగే ప్రమాదం ఉన్నందున, హీటర్ల పంపిణీ ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందని మంత్రి తెలిపారు.