Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్‌ఫ్రమ్ హోమ్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించే అవకాశం కల్పించింది. అదేవిధంగా సగం అధికారిక సమావేశాలను ఆన్‌లైన్ వేదికల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది. దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. కొత్త నిబంధనలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికే తన వాహన బృందాన్ని నాలుగు వాహనాలకు పరిమితం చేసినట్లు చెప్పారు. వాటిలో రెండు విద్యుత్‌తో నడిచే వాహనాలేనని వెల్లడించారు.
వివరాలు
ఆరు నెలల పాటు కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లు నిలిపిసేందుకు నిర్ణయం
ఇంధన ఆదా కోసం ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది. అధికారిక సమావేశాల్లో కనీసం యాభై శాతం సమావేశాలు ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నారు. ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతి సోమవారం మెట్రో రైళ్లలో ప్రయాణించి కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించారు. ఉద్యోగులను ప్రజా రవాణా వినియోగానికి ప్రోత్సహించేందుకు ప్రయాణ భత్యాన్ని పది శాతం పెంచాలని నిర్ణయించారు. అధికారుల వాహనాలకు కేటాయించే పెట్రోల్, డీజిల్ నెలవారీ పరిమితిని ఇరవై శాతం మేర తగ్గించనున్నారు. అలాగే వచ్చే ఆరు నెలల పాటు కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
విదేశీ పర్యటనలకు ఆంక్షలు
మరోవైపు వచ్చే ఏడాది వరకు మంత్రులు, ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అదనంగా మూడు నెలల పాటు ఆర్భాటంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను కూడా నిర్వహించవద్దని సూచించారు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు నివసించే 29 కాలనీలకు 58 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అలాగే నగరంలో రద్దీని తగ్గించి ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.