LOADING...
Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
గంటల తరబడి ముమ్మర తనిఖీలు

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో బాంబు హెచ్చరికలు పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీశాయి. చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ఎర్రకోటతో పాటు ఢిల్లీ అసెంబ్లీ భవనంలో బాంబులు అమర్చినట్టు సమాచారం అందడంతో భద్రతా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు సంబంధిత ప్రాంతాల్లో గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అత్యాధునిక పరికరాలు,శునకాల సహాయంతో ప్రతి మూలనూ శోధించిన అధికారులు అక్కడ ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని అధికారికంగా వెల్లడించారు. ఇవి కేవలం తప్పుడు హెచ్చరికలేనని స్పష్టమవడంతో అధికారులు, సందర్శకులు కొంత ఊరట పొందారు.

వివరాలు 

భద్రతా దృష్ట్యా రాజధానిలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం

కేవలం ఈ రెండు ప్రాంతాలే కాకుండా ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఈ వరుస సంఘటనల వెనుక ఎవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు సవివర దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తుల ఆనవాళ్లను అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, నిన్న జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారు. ఈ పరిణామాల అనంతరం ఢిల్లీలో వరుసగా వచ్చిన బెదిరింపుల వెనుక ఏదైనా దురుద్దేశపూర్వక కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా దృష్ట్యా రాజధానిలో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement