Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం
పంటలకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రతిపాదించడంతో,ఈ ప్రతిపాదనను రానున్న రెండు రోజుల్లో అధ్యయనం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. అప్పటి వరకు ఢిల్లీ చలో మార్చ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్,హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆదివారం చండీగఢ్‌లో రైతు నాయకులతో నాల్గవ రౌండ్ చర్చలు, జరిపారు. సమావేశం అనంతరం పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ సంస్థల ద్వారా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ప్యానెల్ ప్రతిపాదించినట్లు తెలిపారు.
కొనుగోలుపై ఎటువంటి పరిమితి ఉండదు
"ఎన్‌సిసిఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్), నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) వంటి సహకార సంఘాలు 'పప్పు ధాన్యాలు పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని, వచ్చే ఐదేళ్లపాటు తమ పంటను ఎంఎస్‌పీతో కొనుగోలు చేస్తాం'' అని చెప్పారు. కొనుగోలుపై ఎటువంటి పరిమితి ఉండదని ప్రకటించారు. దీని కోసం ఒక పోర్టల్ ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనపై మరో రెండు రోజుల్లో తమ చర్చా వేదికల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని రైతు నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 19-20 తేదీల్లో మా ఫోరమ్‌లలో చర్చించి దీనిపై నిపుణుల అభిప్రాయం తీసుకుని తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
రుణమాఫీ,ఇతర డిమాండ్లపై చర్చలు పెండింగ్
రుణమాఫీ,ఇతర డిమాండ్లపై చర్చలు పెండింగ్‌లో ఉంది,రాబోయే రెండు రోజుల్లో ఇవి పరిష్కారమవుతాయని మేము ఆశిస్తున్నాము,ప్రస్తుతం 'ఢిల్లీ చలో' మార్చ్ కు తాత్కాలిక విరామం ఇచ్చామని,అయితే ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమవుతుందని పంధర్ అన్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో కేంద్రమంత్రులు, రైతు నేతలు సమావేశమైనప్పటికీ చర్చలు కొలిక్కిరాలేదు. తమ డిమాండ్ల కోసం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) కిసాన్ మజ్దూర్ మోర్చా మార్చ్‌కు పిలుపునిచ్చాయి.
ఎంఎస్‌పికి చట్టపరమైన హామీతో పాటు ఇతర డిమాండ్లు
ఎంఎస్‌పికి చట్టపరమైన హామీతో పాటు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, వ్యవసాయ రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల పెంపుదల, పోలీసు కేసుల ఉపసంహరణ ,2021 బాధితులకు "న్యాయం" చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ ఖేరీ హింస, భూసేకరణ చట్టం, 2013 పునఃస్థాపన, 2020-21లో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు.