Page Loader
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం 
కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం 

వ్రాసిన వారు Stalin
Apr 01, 2024
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు కోర్టు కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఆయనను తిహార్ జైలుకు తరలించనున్నారు. హాజరయ్యేందుకు కోర్టుకు వెళుతున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని ఏం చేసినా దేశానికి మంచిది కాదని అన్నారు. కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో అంటే ఏప్రిల్ 1తో ముగిసింది. దీని తర్వాత, కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టులో హాజరుపరిచారు.

Details 

కేజ్రీవాల్ భార్య,మంత్రులను కలిసేందుకు కోర్టు అనుమతి 

ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు..ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు.డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను కేజ్రీవాల్ ఇవ్వలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు.దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటాం.అప్పటిదాకా అరవింద్ కేజ్రీవాల్‌ను 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరగా,దానిని కోర్టు అంగీకరించింది.దీంతో అధికారులు నేడే ఆయనను జైలుకు తరలించనున్నారు. ఆయనను జైలుకు పంపే ముందు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను కలిసేందుకు కోర్టు అనుమతించింది.