'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం
'పాత ఎక్సైజ్ పాలసీ'ని దిల్లీ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ లోగా కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఈ ఆరు నెలల్లో ఐదు డ్రై డేలు ఉంటాయని, అవి మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, బుద్ధ పూర్ణిమ, ఈద్-అల్-ఫితర్, ఈద్-అల్-అధా అని దిల్లీ ప్రభుత్వం చెప్పింది. 2021-22 నాటి ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్న తర్వాత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో పాత ఎక్సైజ్ పాలసీకి పునరుద్ధరించింది.
దిల్లీలో 570 రిటైల్ మద్యం దుకాణాలు
2021-22లో తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎల్‌జీ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేయడంతో దిల్లీ ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. అనంతరం ఈ కేసు విచారణ కోసం సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. దిల్లీ మద్య పాలసీ వ్యవహారంలో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియాను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. దేశ రాజధానిలో 570 రిటైల్ మద్యం దుకాణాలు, 950 కంటే ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు లైసెన్స్‌లు కలిగి ఉన్నాయి.