దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్సీ
మెట్రోలలో రీల్స్, డ్యాన్స్ వీడియోల చిత్రీకరణపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్( డీఎంఆర్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడాన్ని నిషేధిస్తున్నట్లు డీఎంఆర్‌సీ పేర్కొంది. ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల మెట్రోలలో డ్యాన్స్ చేసిన వీడియోలు, రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆదరణ పొందడానికి ఇదొక మంచి మార్గంగా డిజిటల్ క్రియెటర్స్ భావిస్తున్నారు. డ్యాన్స్, రీల్స్ చేయడాన్ని కొందరు వినోదంగా భావించినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారని డీఎంఆర్‌సీ చెప్పింది. అందుకే రైళ్లలో వీడియోలు చిత్రీకరించవద్దని ప్రజలను కోరింది.
మెట్రోలో ప్రయాణికులుగా ఉండాలి: డీఎంఆర్‌సీ
కేవలం ప్రయాణానికి మాత్రమే మెట్రోను ఉపయోగించుకోవాలని, వీడియోలు, రీల్స్ ద్వారా తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం కోసం ఉపయోగించవద్దని డీఎంఆర్సీ ట్వీట్‌లో పేర్కొంది. దిల్లీ మెట్రోలో ఇబ్బంది పెట్టేవారిగా కాకుండా ప్రయాణికులుగా ఉండాలని కోరింది. ఎవరైనా మెట్రో రైళ్లలలో నిబంధనలు ఉల్లఘించి వీడియోలు, రీల్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెట్రోలో వీడియోలు తీయవద్దని గతం కూడా డీఎంఆర్సీ గతంలో ప్రయాణికులను హెచ్చరించింది. సినిమా షూట్‌లకు కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలని డీఎంఆర్సీ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూజ్ దయాల్ హిందుస్తాన్ వెల్లడించారు.