Gopal Rai: దిల్లీ వాయు కాలుష్యం నేపథ్యంలో కేంద్రానికి పర్యావరణశాఖ మంత్రి లేఖ
దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా దిగజారుతోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించే చర్యలను చేపట్టాలని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాసినట్లు మీడియాతో వెల్లడించారు.
కేంద్రానికి దిల్లీ మంత్రి విజ్ఞప్తి
"ఉత్తర భారతదేశాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కృత్రిమ వర్షమే సరైన పరిష్కారం. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం అవసరం. గత మూడు నెలలుగా కృత్రిమ వర్షంపై కేంద్రానికి లేఖలు రాస్తున్నా, కానీ ఇంకా స్పందన లేదు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలి," అని గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.
పొగమంచు ప్రభావం..తీరని ఇబ్బందులు
మరోవైపు, మంగళవారం కూడా దిల్లీని పొగమంచు పూర్తిగా కప్పేసింది. దీంతో గాలి నాణ్యత సూచీ (AQI) 494కు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను కూడా దాటింది.వాతావరణ శాఖ అధికారుల ప్రకారం, వరుసగా రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ప్రయాణాలకు తీవ్ర అంతరాయం పొగమంచు కారణంగా దూరం నుంచి వస్తున్న వాహనాలు కనిపించకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. పలు విమానాలు, రైళ్లు ఆలస్యమవుతుండగా,కొన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని ఎయిర్‌లైన్స్ ప్రత్యేక సూచనలను విడుదల చేశాయి. వాయు కాలుష్యం వల్ల కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని,దీని నియంత్రణ కోసం కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.