Delhi: ఢిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. పరారీలో తండ్రి
దిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య గురయ్యాడు.బాధితుడిని 29ఏళ్ల జిమ్ ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్‌గా గుర్తించారు. ఈరోజు(గురువారం)తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని అతని ఇంటిలో అతని ముఖం,ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ హత్యలో అతని తండ్రి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని తండ్రి కోసం గాలిస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని దేవ్లీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితుడు గౌరవ్ సింఘాల్ తమ్ముడిని,బంధువును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని,ఇప్పటి వరకు తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసిందని,ప్రధాన నిందితుడి అరెస్టు తర్వాత అంతా తేలిపోతుందని అధికారి తెలిపారు.
ఈ రోజు గౌరవ్ సింఘాల్ పెళ్లి
ఈ ఘటనపై అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సౌత్)అంకిత్ చౌహాన్ తెలిపారు. దాడి తరువాత, సింఘాల్ కుటుంబ సభ్యులు అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. మరణించిన గౌరవ్ సింఘాల్ పెళ్లి ఈ రోజు జరగాల్సి ఉందని,ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని డీసీపీ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ మార్చురీకి తరలించారు.సింఘాల్ ఫ్యామిలీ మాత్రం తమ కుటుంబంలో ఎవరిపై అనుమానం లేదని చెబుతోంది. "నా మేనల్లుడి హత్య గురించి అర్ధరాత్రి నాకు కాల్ వచ్చింది.నేను వెంటనే ఇంటికి వెళ్ళాను.నేను అక్కడికి చేరుకున్నప్పుడు,గౌరవ్ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.కుటుంబంలో ఎవరిపై అనుమానం లేదు"అని మృతుడి మేనమామ జావర్ తెలిపారు.
ముఖం, ఛాతీపై 15 కత్తిపోట్లు
ఈ హత్య గురించి మొత్తం కుటుంబానికి ఎలాంటి క్లూ లేదని, ఇంటి దగ్గర ఢోల్ శబ్ధం ఉండటంతో ఎలాంటి అరుపులు కూడా వినిపించలేదని,పోలీసులు సక్రమంగా విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబ సభ్యుడు జై ప్రకాష్ సింఘాల్ అన్నారు. ముఖం, ఛాతీపై 15 కత్తిపోట్లు ఉండటంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మరణం వెనక అసలు కారణం తెలుసుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నామని, దీనిపై మొత్తం 5 టీములు పనిచేస్తున్నాయని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.