
Delhi HC Judge: నోట్లకట్టల వివాదం.. జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలో దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ మొత్తంలో నగదు కనిపించినట్లు వార్తలు వెలువడటం తీవ్ర సంచలనం రేపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో,దిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ ఆయనను తాత్కాలికంగా న్యాయపరమైన విధుల్లో నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని హైకోర్టు ప్రకటించింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద సమయంలో పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు కనిపించడం గమనార్హం.
ఈ వీడియోను దిల్లీ పోలీస్ కమిషనర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా, ఆయన దీన్ని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందజేశారు.
వివరాలు
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు
దీనిపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి ఈ నివేదికను ఫొటోలు, వీడియోలతో సహా తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
అందులో కూడా కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
త్వరలోనే ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. అయితే, ఈ కమిటీ నివేదిక అందించేందుకు గడువు విధించలేదని తెలుస్తోంది.
తమపై వస్తున్న ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించిన వివరణలో, తాను లేదా తన కుటుంబసభ్యులు ఎలాంటి నగదు అక్కడ ఉంచలేదని స్పష్టం చేశారు.
వివరాలు
యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారానే లావాదేవీలు
తన ప్రతిష్ఠను మసకబార్చేందుకు ఇది ఒక కుట్రగా అభివర్ణించారు. తమ కుటుంబ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరుపుతామని , యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు.
తన ఇంట్లోని ఆ గదిని అపరిచిత వస్తువులు, పాత ఫర్నిచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, తోటపని సామగ్రి వంటి వాటిని నిల్వ చేసే గదిగా ఉపయోగిస్తామని వివరించారు.
జస్టిస్ వర్మపై వచ్చిన ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు తోసిపుచ్చారు.
మూడు తరాలుగా జస్టిస్ వర్మ కుటుంబాన్ని తాను బాగా తెలుసునని, ఈ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.