రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా
దిల్లీ హైకోర్టులో ఓ మహిళా న్యాయమూర్తి రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలం పాటు దిల్లీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి, సోమవారం కెరీర్ లోనే చివరి వర్కింగ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో కేసులను విచారించారు. ఈ మేరకు పదవీ విరమణ రోజున ఈ మహిళా జడ్జి ఏకంగా 65 కేసులను విచారించి తీర్పు చెప్పడం విశేషం. ఒక్కరోజే ఎన్నో ధర్మాసనాలకు నేతృత్వం వహించిన జస్టిస్ గుప్తా, వేగంగా విచారిస్తూ తీర్పులను వెలువరించారు. పలు అత్యాచార, హత్య కేసుల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆయా శిక్షలను జీవిత ఖైదుగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2014లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్
14 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించిన జస్టిస్ ముక్తా గుప్తా సోమవారం రిటైరయ్యారు. మహిళా న్యాయముర్తికి జూన్ 26, చివరి పనిదినం కావడంతో ఒక్కరోజే ఏకంగా 65 కేసులను విచారణ చేపట్టి తుది తీర్పును వెలువరించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు క్యాంపస్ సందర్శకుల రద్దీతో నిండిపోయింది. ఒక్క రోజులోనే ఇంత భారీ సంఖ్యలో కేసులు విచారణ చేయడంతో న్యాయవాదులతో పాటు ఆయా కేసుల నిందితులు, సాక్షులతో కోర్టు ప్రాంగణం సందడిగా మారింది. ముక్తా తొలుత 2009లో దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2014లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.