
Delhi HC Judge: దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం - ఆర్పేందుకు వెళితే కట్టల కొద్దీ నోట్లు..!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు అక్కడికి చేరుకున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
వారు అక్కడ పెద్ద మొత్తంలో నగదు కనిపించడం గమనించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చురుకుగా స్పందించి, జస్టిస్ వర్మను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఈ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
వివరాలు
అగ్నిప్రమాద సమయంలో న్యాయమూర్తి గైర్హాజరు - కుటుంబసభ్యులే సమాచారమిచ్చారు
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ప్రమాదాన్ని గమనించిన ఆయన కుటుంబసభ్యులు అగ్నిమాపక సిబ్బంది,పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిని అదుపులోకి తెచ్చిన తర్వాత, అక్కడ భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు, వారూ ఘటనా స్థలానికి చేరుకుని ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో, అది లెక్కల్లో కనిపించని నగదు అని నిర్ధారణ అయ్యింది.
వివరాలు
సీజేఐ ఖన్నా నిర్ణయం - కొలీజియం అత్యవసర సమావేశం
ఈఅంశం పై ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ సంజీవ్ ఖన్నాకు నివేదిక అందింది.
దీనిని ఆయన అత్యంత సీరియస్‌గా పరిగణించి,వెంటనే కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
చర్చల అనంతరం,జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని తేల్చారు.
గతంలోనూ వర్మ అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించి,2021లో దిల్లీకి బదిలీ అయ్యారు.
కొలీజియం అంతర్గత చర్చ - కేవలం బదిలీ సరిపోతుందా?
కొలీజియంలో ఉన్న ఐదుగురు సభ్యులలో కొందరు,ఈ ఘటన న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడ్డారు.
కేవలం బదిలీ చేయడం వల్ల న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం తిరిగి రాదని,దీని పై మరింత లోతుగా విచారణ జరిపి,జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని కోరడమో లేక అంతర్గత విచారణ చేపట్టడమో చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
వివరాలు
2008లోనూ ఇదే తరహా సంఘటన
ఇలాంటి ఘటనే 2008 ఆగస్టు 13న చోటుచేసుకుంది. అప్పట్లో పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ నివాసం ఎదుట రూ. 15 లక్షల నగదు ఉన్న పెట్టె ఉంచారు.
దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు సీబీఐకి అప్పగించబడింది.
విచారణ అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి.
2009 వరకు పంజాబ్-హరియాణా హైకోర్టులో పనిచేసిన ఆమెకు ఓ కేసు తీర్పు కోసం అందాల్సిన డబ్బును పొరపాటున జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి వద్ద ఉంచినట్లు విచారణలో తేలింది.