దిల్లీ మద్యం కేసు: మార్చి 20వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
దిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వారం రోజుల రిమాండ్ ముగియడంతో సీబీఐ సోమవారం రోస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ క్రమంలో సిసోడియాను 14రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అంటే మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సిసోడియాను సీబీఐ గత వారం అరెస్టు చేశారు.
సిసోడియాకు భగవద్గీత, డైరీ, పెన్ను ఇవ్వాలని కోర్టు ఆదేశం
కళ్లద్దాలు, భగవద్గీత, డైరీ, పెన్ను ఇవ్వాలని కోరుతూ సిసోడియా పెట్టుకున్న దరఖాస్తును కూడా కోర్టు అనుమతించింది. విపాసన (ధ్యానం) సెల్‌లో ఉంచాలన్న సిసోడియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ప్రశ్నలను పదేపదే అడుగుతూ తనను మానసికంగా వేధించిందని సిసోడియా ఆరోపించారు. ఇదిలా ఉంటే, సిసోడియా అరెస్టుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అతనిని వెంటనే విడుదల చేయాలని పలు ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ లేఖ రాశాయి.