Delhi: ఐఫోన్ 18 ప్రో కోసం బంగారం విక్రయించిన భర్త.. నోయిడాలో ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది. ఐఫోన్ 18 ప్రో విక్రయాలు శుక్రవారం భారత్‌లో ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు తెల్లవారుజాము నుంచే ఆపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు. నోయిడాలోని డీఎల్‌ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆపిల్ స్టోర్ వద్ద కూడా భారీగా క్యూ ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని ప్రత్యేకంగా నిలిచింది. భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేసేందుకు తాను బంగారం అమ్మినట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు. తన భార్యకు బర్గండీ రంగు ఐఫోన్ కావాలని ఉందని,ఆమె ఇప్పటివరకు ఐఫోన్ ఉపయోగించలేదని చెప్పాడు.
వివరాలు
కాబోయే భార్య కోసం మరో వ్యక్తి..
అందుకే ఆమెకు కొత్త ఫోన్‌ను కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు.
''గతంలో నా దగ్గర డబ్బు లేదు.. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతం ఉన్న డబ్బుతో ఇప్పుడే జీవించాలి'' అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
చివరకు ఫోన్ కొనుగోలు కోసం బంగారం విక్రయించినట్లు తెలిపాడు.
పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్ కూడా తన కాబోయే భార్యకు బహుమతిగా ఇవ్వడానికి ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేసేందుకు నోయిడాకు వచ్చాడు.
తన కోసం ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను కూడా కొనుగోలు చేశాడు.
రెండు ఫోన్ల కోసం రూ.3.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించాడు.
ఇందుకోసం తెల్లవారుజామున 6 గంటల నుంచే స్టోర్ ముందు వేచి ఉన్నట్లు తెలిపాడు.
వివరాలు
ధర పెరిగినా.. క్రేజ్ తగ్గలేదు
కొంతమంది దంపతులు తమ కోసం రెండు ఐఫోన్ 18 ప్రో ఫోన్లు కొనుగోలు చేశారు.
ధరలు పెరిగినప్పటికీ ఐఫోన్ అభిమానులు కొనుగోలు చేసేందుకు వెనుకాడరని ఓ మహిళ పేర్కొంది.
విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు సైతం ఫోన్ కోసం క్యూ కట్టారు. కొందరు ఏకంగా సెలవు పెట్టుకుని మరీ స్టోర్‌కు వచ్చారు.
అయితే ప్రీ-ఆర్డర్ చేయని వారికి ఆ రోజు ఫోన్ కొనుగోలు చేసే అవకాశం దక్కలేదు. దీంతో కొంతమంది నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.