LOADING...
Bomb Threat: దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. 
దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

Bomb Threat: దిల్లీ,నోయిడాలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో పాఠశాలలకు (Delhi Schools) బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్ ఢిల్లీ, నోయిడాలోని అనేక పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా హెచ్చరిక రావడంతో అప్రమత్తమైన అధికారులు, భద్రతా కారణాల రీత్యా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది పాఠశాలలను పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. మయూర్ విహార్‌లోని అహ్లాకాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయాన్ని ప్రిన్సిపల్, పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు టెలిఫోన్ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.

వివరాలు 

శివ్ నాడార్ స్కూల్‌కు కూడా బెదిరింపులు

అదే విధంగా,నోయిడాలోని శివ్ నాడార్ స్కూల్‌కు కూడా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది,డాగ్ స్క్వాడ్ స్కూల్‌లో పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది గుర్తించేందుకు సైబర్ టీమ్ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకూడదని, అర్ధరహిత వార్తలను నమ్మొద్దని నోయిడా పోలీసులు సూచించారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత నెల 10న స్కూళ్లకు బెదిరింపుల వెనక ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ విద్యార్థి తన పాఠశాల పరీక్షలను తప్పించుకునేందుకు ఈ బెదిరింపులు చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనలో 12వతరగతి చదువుతున్న విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.

వివరాలు 

ఆరు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్

ఆ విద్యార్థి దాదాపు ఆరు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపించాడు. అయితే ప్రతిసారి తన స్కూల్‌ను కాకుండా,ఇతర పాఠశాలల పేరుతో బెదిరింపు మెయిల్స్ పంపేవాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఈ వ్యూహాన్ని రచించాడని అధికారులు తెలిపారు. ప్రతిసారి తన మెయిల్‌లో పలు స్కూళ్లకు ఒకేసారి బెదిరింపు మెయిల్స్ పంపేవాడు. ఓసారి ఏకంగా 23 స్కూళ్లకు ఒకేసారి మెయిల్ పంపినట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరుకావాలన్న ఉద్దేశం లేకపోవడంతో ఆ మైనర్ విద్యార్థి ఈ బెదిరింపులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బెదిరింపుల వల్ల పరీక్షలు రద్దవుతాయని భావించి అతడు ఇలా చేశాడని గుర్తించారు. డజన్ల సంఖ్యలో అబద్ధపు బాంబు బెదిరింపులు రావడంతో,కొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.