LOADING...
Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI)తో సంబంధాలు ఉన్న అంతర్రాష్ట్ర ఉగ్రవాద, ఆయుధాల ముఠాను ఛేదించినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారిలో ముగ్గురిని పంజాబ్‌లో, మరొకరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిని శుభ్‌దీప్ సింగ్ అలియాస్ విశాల్ (23), గుర్జంత్ సింగ్ అలియాస్ రిషి (22), సజన్ సింగ్ అలియాస్ హనీ (28), గగన్‌ప్రీత్ (24)గా గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో రెండు తుపాకులు, అందులో ఒక జిగానా పిస్టల్, ఒక .30 బోర్ పిస్టల్, తొమ్మిది సజీవ బుల్లెట్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

ఢిల్లీ,పంజాబ్‌లలో పలుచోట్ల దాడులు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక విభాగం పోలీసులు ఆపరేషన్ చేపట్టినట్లు స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ త్రిపాఠి తెలిపారు. ఈ కుట్ర కోసం పంజాబ్‌కు చెందిన యువకులను నియమించినట్లు సమాచారం రావడంతో సాంకేతిక విశ్లేషణ,గూఢచారి సమాచారం ఆధారంగా అనుమానితులను గుర్తించి ఢిల్లీ,పంజాబ్‌లలో పలుచోట్ల దాడులు నిర్వహించినట్లు చెప్పారు. అమృత్‌సర్‌లోని మజీఠా రోడ్డులో తొలుత శుభ్‌దీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సెమీ ఆటోమేటిక్ పిస్టల్, ఐదు సజీవ బుల్లెట్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

గగన్‌ప్రీత్‌ అరెస్టు

విచారణలో పాకిస్థాన్‌లో ఉన్న ఐఎస్‌ఐ హ్యాండ్లర్ షెహ్‌జాద్ భట్టీ నెట్‌వర్క్‌కు చెందిన వ్యక్తులతో తాను సంబంధాలు కొనసాగించినట్లు,డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి ఆయుధాలు,మాదకద్రవ్యాల సరుకులు అందుకున్నట్లు అతడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 24న ఢిల్లీలో గగన్‌ప్రీత్‌ను అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్‌లో కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు అతడికి ఢిల్లీలోని ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లపై నిఘా పెట్టాలని, అనంతరం కాల్పుల ఘటనకు పాల్పడాలని ఆదేశించినట్లు విచారణలో బయటపడిందని వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని తారన్ తారన్ ప్రాంతానికి చెందిన శుభ్‌దీప్ డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి పడవేసిన ఆయుధాలు, మాదకద్రవ్యాల సరుకులను స్వీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

వివరాలు 

సజన్ సింగ్‌పై గతంలో ఎన్డీపీఎస్ కేసు

గుర్జంత్ సింగ్, అతని బంధువు సజన్ సింగ్ కూడా పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు కొనసాగిస్తూ డ్రోన్ల ద్వారా వచ్చిన ఆయుధాలు, మాదకద్రవ్యాలను స్వీకరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. సజన్ సింగ్‌పై గతంలో ఎన్డీపీఎస్ కేసు నమోదైందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్ హ్యాండ్లర్లు గగన్‌ప్రీత్‌కు పోలీస్ స్టేషన్లు, చెక్‌పోస్టులపై నిఘా నిర్వహించి కాల్పుల దాడి చేయాలని సూచించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement