LOADING...
Delimitation: ఇకపై లోక్‌సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం
ఇకపై లోక్‌సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం

Delimitation: ఇకపై లోక్‌సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీన ఈ రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎంపీలకు ఇప్పటికే సమాచారం అందించి,బిల్లుల ప్రతులను పంపించింది. పునర్విభజన బిల్లులోని ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను గణనీయంగా పెంచే యోచనలో ఉన్నారు. రాష్ట్రాల్లో సుమారు 815 స్థానాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 35 స్థానాలుపెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ప్రస్తుతం ఉన్న 543 స్థానాల లోక్‌సభ సంఖ్య 850కు చేరే అవకాశముందని తెలుస్తోంది.

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెరగనున్న రిజర్వేషన్లు

ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసి, వేగంగా స్థానాల పెంపు ప్రక్రియ పూర్తి చేసి 2029 ఎన్నికల నాటికి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. స్థానాల పెంపు ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది. జనగణన అనంతరం వచ్చిన గణాంకాల ఆధారంగా స్థానాల పెంపు చేపడితే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని దక్షిణాది రాజకీయపార్టీలు మొదటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం వరకు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వివరాలు 

ఇండియా కూటమి సమావేశం

దీని వల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రాష్ట్రాల్లో దాదాపు యథాతథంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై బుధవారం ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. బిల్లులో ప్రతిపాదించిన అంశాలపై ఇప్పటికే సమాచారం అందిన నేపథ్యంలో, వాటిపై సమగ్రంగా చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement