LOADING...
Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం
మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం

Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకొని నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించారు. అందుకే ప్రతిపక్షాలు ఏకమై ఈ యత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. ఈ నిర్ణయంతో మోదీ రాజకీయ పతనం పార్లమెంట్ నుంచే ప్రారంభమైందని, అది బెంగాల్‌లో కూడా కొనసాగుతుందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో అనుసంధానించేందుకు భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు.

వివరాలు

మహిళల ఎదుగుదలను అడ్డుకుంటున్నారు : మోదీ

అదే కేంద్రం అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిందని మమత పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచీ మహిళల రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడుతోందని, పార్లమెంట్‌తో పాటు రాష్ట్ర శాసనసభలో కూడా తమ పార్టీలోనే అత్యధికంగా మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారని వివరించారు. అలాంటి తమ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు ఎలా వ్యతిరేకిస్తుందనే ప్రశ్నను లేవనెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఈ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వల్లనే తాము వ్యతిరేకించామని స్పష్టం చేశారు. ఇక మరోవైపు, బెంగాల్‌లో మహిళల ఎదుగుదలకు తృణమూల్ కాంగ్రెస్ అడ్డంకిగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా బెంగాల్ ప్రభుత్వం అవమానించిందని విమర్శించారు.

వివరాలు

టీఎంసీ నేతలు కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్నారు

ఆమె బెంగాల్ పర్యటన సందర్భంగా టీఎంసీ నేతల ప్రవర్తనను దేశం మొత్తం గమనించిందని అన్నారు. ఈ ఘటనలను ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో టీఎంసీకి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. బెంగాల్‌లోని బంకురాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని, కానీ ఆ చట్టాన్ని అడ్డుకునేందుకు టీఎంసీ నేతలు కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్నారని మోదీ ఆరోపించారు. మహిళా సాధికారత, భద్రత కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమని తాము నమ్ముతున్నామని ప్రధాని స్పష్టం చేశారు.

Advertisement