LOADING...
Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం
భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం

Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఈసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నగర చరిత్రలో తొలిసారిగా శుక్రవారం ఒక్కరోజులోనే వినియోగం 100మిలియన్ యూనిట్లను దాటింది. ఎండల తీవ్రత కారణంగా నగర ప్రజలు ఒక్క రోజులోనే 10 కోట్ల 5 లక్షల 60 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఈ గణాంకాలు వేసవి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో నగరంలో నీటి వినియోగం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నిరంతరం ఉపయోగిస్తున్నారు. వేడిమి కారణంగా చాలామంది రోజుకు మూడు సార్లు స్నానం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.

వివరాలు

గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం

మరోవైపు బోర్లలో నీటి మట్టం పాతాళానికి చేరడంతో మోటార్లు నిరంతరం నడపాల్సి వస్తోంది. ఈ కారణాలన్నీ కలిపి గత వారం రోజులుగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఐదేళ్లలో వినియోగం దాదాపు రెండింతలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం అంటే నగర ప్రజలు ఒక రోజులో ఉపయోగించే మొత్తం యూనిట్ల పరిమాణం. శుక్రవారం నమోదైన వినియోగం 10.56 కోట్ల యూనిట్లు. మరోవైపు డిమాండ్ అంటే ఒక సమయంలో నమోదయ్యే గరిష్ఠ విద్యుత్ అవసరం. ప్రస్తుతం ఇది 4,700 మెగావాట్ల స్థాయికి చేరుకుంది. నగర విస్తరణతో పాటు వినియోగం మరింత పెరుగుతోంది.

వివరాలు

అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం

ప్రస్తుతం నగరంలో సుమారు 54 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నగర విస్తరణ, కొత్త నివాస ప్రాంతాల అభివృద్ధి, అలాగే పలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCCs) రాకతో ప్రతి సంవత్సరం విద్యుత్ వినియోగం 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతోంది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ పెరుగుదల 22 శాతానికి పైగా నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది వినియోగం 100 మిలియన్ యూనిట్లను, అలాగే గరిష్ఠ డిమాండ్ 5,000 మెగావాట్లను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసినట్లు వారు తెలిపారు.

Advertisement