దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు
దిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. అలాగే నగరంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పడిపోయాయి. వాస్తవానికి మే నెలలో దల్లీలో ఎండలు మండిపోవాలి. 40డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. అయితే ఆసక్తికరంగా ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 39.5 డిగ్రీల నమోదు కావడం గమనార్హం. మే నెలలో ఇది చాలా తక్కువ అని చెప్పాలి. ఇదిలా ఉంటే, బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. అంటే సాధారణం కంటే తొమ్మిది డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక గురువారం కనిష్టంగా 15.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది 13 సంవత్సరాలలో ఈ నెలలో కనిష్ట ఉష్ణోగ్రత ఇదే.
24 గంటల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం
గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, గాలులు, పగటిపూట, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండటంతో పొగమంచు ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దిల్లీలో విజబులిటీ 501 - 1,000 మీటర్లగా నమోదైనట్లు ఐఎండీ చెప్పింది. దిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం ఉదయం నాటికి 24 గంటల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిల్లీలో శుక్రవారం నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.