Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు
దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ కమ్ముకుంది. దీపావళి సందర్భంగా టపాసుల నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు టపాసులు పేల్చడంతో గాలి నాణ్యత అధ్వాన్న స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఉదయం 6 గంటలకు గాలి నాణ్యత సూచీ 395 పాయింట్లకు చేరుకుంది. ఇది 'తీవ్ర' స్థాయికి సంకేతం. బురారీ, ఆర్కే పురం, అశోక్ విహార్, మందిర్ మార్గ్, ఎయిర్‌పోర్టు, జహంగీర్‌పుర్ ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత 350 పాయింట్ల పైనే నమోదైంది.
ఆంక్షలను పట్టించుకోవడంతో తీవ్ర వాయు కాలుష్యం
దిల్లీ చుట్టుపక్కల నోయిడా, గాజియాబాద్, గురుగ్రామ్‌లో కూడా అలాంటి పరిస్థితే ఉంది. గురువారం రాత్రి నుంచే గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైంది. ప్రభుత్వం గతంలోనే దిల్లీలో టపాసుల తయారీ, అమ్మకాలు, వినియోగంపై ఆంక్షలు విధించి, ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నిషేధం ఆన్‌లైన్ విక్రయాలు, డెలివరీలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ కొందరు ఈ ఆంక్షలను పట్టించుకోకపోవడం వల్ల కాలుష్య సమస్య తీవ్రరూపం దాల్చింది.