LOADING...
Bhatti vikramarka: యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Bhatti vikramarka: యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

రైతులకు అవసరమైన యూరియా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పట్ల ఉందని,ఈ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గిరిజన రైతుల పంటల సాగు మెరుగుపడేందుకు ఇందిరా సౌరవికాసం పథకం ద్వారా సౌరశక్తి ఆధారిత పంపులు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు, స్ప్రింక్లర్లు పూర్తిగా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు వచ్చే మూడు సంవత్సరాలలో మొత్తం రూ.12,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

వివరాలు 

 విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య శిబిరాలు 

జిల్లాలలో మహిళా సంఘాల భాగస్వామ్యంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వర్షాకాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, యూరియా లేమిపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. అవసరమైన యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లా రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,రెవెన్యూ శాఖలో అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఆసుపత్రులు,వసతిగృహాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించి, ఆయన ప్రతినెలా ఆ ప్రాంతాలను సందర్శించి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి,పోరిక బలరాం నాయక్,ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య, నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మువ్వా విజయబాబు,ఉభయ జిల్లాల ప్రత్యేకాధికారి సురేంద్ర మోహన్,ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.