డీజీసీఏ: ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి రూ.10లక్షల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన 'గో ఫస్ట్' విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.10 లక్షల జరిమానా విధించింది.
జనవరి 9న, 55 మంది ప్రయాణికులు 'గో ఫస్ట్' విమానంలో దిల్లీకి వెళ్లేందుకు బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగ్ పాస్, లగేజీని చెక్-ఇన్ అయ్యాక బస్సుల్లో విమానం దగ్గరికి వెళ్లగా, అది అప్పటికే వెళ్లిపోవడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
దీంతో 'గో ఫస్ట్' విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఏవియేషన్ మినిస్టర్, ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
డీజీసీఏ
జనవరిలో మూడో జరిమానా విధించిన డీజీసీఏ
'గో ఫస్ట్' విమాన ఘటనను డీజీసీఏ చాలా సీరియస్‌గా తీసుకుంది. బాధ్యతలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌లైన్‌కు షోకాజు నోటీసు జారీ చేసింది.
దీంతో 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ జనవరి 25 షోకాజ్ నోటీసుకు తమ సమాధానాన్ని డీజీసీఏకు సమర్పించింది. 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ సమాధానానికి సంతృప్తి చెందని డీజీసీఏ రూ. 10లక్షల జరిమానా విధించింది.
ఈ మధ్య కాలంలో దేశీయ విమాన సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో డీజీసీఏ కూడా విమానయాన సంస్థలపై కొరడా ఝులిపిస్తోంది. ఇటీవల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్‌కు రెండు జరిమానాలు విధించింది. అవి కూడా కూడా జనవరిలోనే విధించింది. దీంతో జనవరిలో డీజీసీఏ విధించిన జరిమానాలు మూడు చేరడం గమనార్హం.