గోఫస్ట్ ఎయిర్ లైన్స్ సేవలకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
గోఫస్ట్ విమానయాన సంస్థ తన సర్వీసులను పునఃప్రారంభించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. కానీ ఇందుకు సంబంధించి పలు షరుతులు విధించింది. దివాలా ప్రక్రియ ఎదుర్కొంటున్నగో ఫస్ట్ తన కార్యకలాపాలను తిరిగి నిర్వహించేందుకు DGCA ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో 15 విమానాలతో రోజుకు 114 సర్వీసులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గో ఫస్ట్ విమానయాన సంస్థ వాడియా గ్రూప్‌నకు చెందింది. కాగా నిధుల కొరతతో ఈ సంస్థ సర్వీసులను నిలిపేసింది. ఈ క్రమంలోనే మే 3 నుంచి సదరు సంస్థ సర్వీసులు ఆగిపోయాయి.
రూల్స్ అనుసరించాలని గో ఫస్ట్ సంస్థకు DGCA సూచన
దివాళ ప్రక్రియను ఎదుర్కొంటున్న గో ఫస్ట్, తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు జూన్ 28న డీజీసీఏకు దరఖాస్తు పెట్టుకుంది. ప్రత్యేక పరిశీలన తర్వాత సేవల పునఃప్రారంభానికి విమానయాన నియంత్రణ సంస్థ అనుమతించింది. అయితే దిల్లీ హైకోర్టు, దిల్లీ ఎన్‌సీఎల్‌టీ బెంచ్ వద్ద సంస్థకు సంబంధించి రిట్ పిటిషన్లు / దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా తీర్పులకు లోబడే ఈ అనుమతులు ఉంటాయని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నియంత్రణ సంస్థ రూల్స్ తప్పక అనుసరించాలని సంస్థకు మార్గనిర్దేశం చేసింది. నిధుల లభ్యత ఆధారంగా షెడ్యూల్డ్ విమానాలను మళ్లీ ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది.