ధన్‌బాద్: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం
జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది సజీవ దహనమయ్యారు. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో మంటలు చేలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ధన్‌బాద్ డీఎస్పీ ప్రకటించారు. అపార్ట్‌మెంట్‌లో చాలా మంది వ్యక్తులు చిక్కుకుపోయారని డీఎస్పీ చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది భవనంలోని ఆరు, ఏడో అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అపార్ట్‌మెంట్‌లో 400మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీ, సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి
అగ్నిప్రమాదం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని చెప్పారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలను ప్రత్యేక్షంగా సీఎం సోరెన్ పర్యవేక్షిస్తున్నారు. ధన్‌బాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రధాని ప్రధాన మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పు, గాయపడిన 50,000 రూపాయలు చొప్పున అందించనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.