LOADING...
Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
పలువురికి తీవ్ర గాయాలు

Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉండటం హృదయ విదారకం. ఈ ప్రమాదంలో మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, పనులు ముగించుకుని సుమారు 40 మందికి పైగా కూలీలు ఒకే వాహనంలో తమ గ్రామాల వైపు ప్రయాణం ప్రారంభించారు. వాహనం సామర్థ్యానికి మించి ప్రయాణికులతో పాటు వేగంగా వెళ్తుండగా, చిక్లియా ఫాటా సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.

వివరాలు 

మెరుగైన వైద్యం కోసం ఇండోర్ ఆసుపత్రులకు తరలింపు 

దీంతో వాహనం వరుసగా పల్టీలు కొట్టి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్‌లో ఉన్నవారు దాని కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ధార్ జిల్లా భోజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఇండోర్ ఆసుపత్రులకు తరలించారు.

వివరాలు 

మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన

ఈ ఘటనపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఈ ఘటనపై తిర్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాన మంత్రి చేసిన ట్వీట్ 

Advertisement