
Dharmavaram Silk Sarees: 'ధర్మవరం' పట్టు చీరకు జాతీయ గుర్తింపు.. 'ఒక జిల్లా ఒక ఉత్పత్తి' 2024 అవార్డు..
ఈ వార్తాకథనం ఏంటి
మన ధర్మవరం చేనేత పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" (ODOP - One District One Product) కార్యక్రమంలో భాగంగా 2024 సంవత్సరానికి గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ధర్మవరం పట్టు చీరలు అందుకున్నాయి. దీనికి సంబంధించిన అవార్డును ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ,చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అందుకున్నారు. ధర్మవరం చేనేత పట్టు చీరలు భారతదేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
వివరాలు
ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్..
ఈ గౌరవం ధర్మవరం చీరల ప్రత్యేకతను,అక్కడి కళాకారుల నైపుణ్యాన్ని దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత గుర్తింపునిస్తూ,చేనేత రంగ అభివృద్ధికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ అవార్డు ప్రదానోత్సవం సోమవారం నాడు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించగా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చేతుల మీదుగా మంత్రి సవిత, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంయుక్తంగా అవార్డును అందుకున్నారు.
వివరాలు
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఈ అవార్డులు వాణిజ్య రంగానికి ప్రోత్సాహమే కాక, స్థానికంగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యతను కలిగిస్తున్నాయని తెలిపారు. హస్తకళలకు మాత్రమే పరిమితం కాకుండా, భారతదేశ భవిష్యత్తుకు ఒక సాంస్కృతిక గుర్తింపుగా కూడా ఈ కార్యక్రమం నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ అవార్డు లభించడాన్ని రాష్ట్రానికి గర్వకారణంగా అభివర్ణిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.