Kotla Surya Prakash Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. ఆయనకు ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థత ఏర్పడినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది.
డోన్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో..
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇటీవల డోన్ నియోజకవర్గంలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం బేతంచర్లలో జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివారం రాత్రి బేతంచర్లలోని హోసన్నా చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాక, నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు.
2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ
తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా 1991, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కోట్ల కుటుంబానికి రాజకీయంగా నష్టాలు ఏర్పడ్డాయి. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన ఓటమిని చవిచూశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన, 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీచేసి మరోసారి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీ బలోపేతం కోసం కృషి చేసిన ఆయనకు 2024 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కింది. ఈసారి ఆయన విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు.