LOADING...
Dhwajarohan at Ayodhya: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

Dhwajarohan at Ayodhya: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో మంగళవారం అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడి శిఖరంపై కాషాయ రంగులో రూపొందించిన ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వసర్వుడు మోహన్‌ భగవత్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వంటి అనేక ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

వివరాలు 

ధ్వజారోహణం.. ప్రత్యేకతలివే.. 

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నదనే సంకేతంగా ఈ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని సుమారు 7 వేల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. గత సంవత్సరం జనవరి 22న ఇదే ఆలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ఆలయ శిఖరంపై సుమారు 42 అడుగుల ఎత్తులో ప్రధానమంత్రి మోదీ ఈ ధర్మధ్వజాన్ని ఎగురవేశారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబాకార త్రిభుజ రూపంలో సిద్దమైన ఈ కాషాయ జెండాపై రాముడి పరాక్రమాన్ని ప్రతిబింబించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం వంటి చిహ్నాలను బంగారు నూలుతో చేతితోనే నాజూకుగా ఎంబ్రాయిడరీ చేశారు.

వివరాలు 

తేదీ ప్రాముఖ్యత 

ఈ ధర్మధ్వజం సాంస్కృతిక ఐక్యతను, భారతీయ సంప్రదాయ పరంపరను, రామరాజ్య సూత్రాలను సంకేతాలుగా వ్యక్తపరుస్తుంది. వాల్మీకి రామాయణం ప్రకారం, కశ్యప మహర్షి మందార, పారిజాత వృక్షాలను సంయోజింపడంతో కోవిదార చెట్టు ఉద్భవించినట్లు పురాణాల్లో చెప్పబడింది. దీని ద్వారా ప్రాచీన కాలంలోనే వృక్ష కలయిక విధానాలు ఉన్నాయని అర్థమవుతుంది. ధ్వజారోహణ నిర్వహించిన ఈ రోజు వివాహ పంచమి, అంటే సీతారాముల దివ్య కల్యాణం జరిగిన పవిత్రమైన తిథి. అలాగే శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ లగ్నంలో జన్మించినట్లు చెబుతారు. ఈ ప్రత్యేకతలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ధ్వజారోహణను కూడా అదే అభిజిత్ లగ్నంలో జరిపారు.

వివరాలు 

జెండా తయారీ 

ఈ ధర్మ ధ్వజాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పారాచ్యూట్ తయారీలో నిపుణత కలిగిన ఒక సంస్థ రూపొందించింది. దీర్ఘకాలం నిలకడగా ఉండేలా పారాచ్యూట్ గ్రేడ్‌ ఫ్యాబ్రిక్, బలమైన పట్టుదారాలు ఉపయోగించి సుమారు 25 రోజుల పాటు కృషి చేసి దీనిని సిద్ధం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ