Andhra Pradesh: ఏపీలో భిన్నంగా వాతావరణ మార్పులు.. ఎండలతో పాటు వానల హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు మండుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో ఆదివారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే కొప్పెరపాడులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలోని 286 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి విస్తరించి ఉందని వివరించారు.
వివరాలు
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
దీని ప్రభావంతో సోమవారం అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడిస్తూ, డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 72.7 మిల్లీమీటర్లు, కాట్రేనికోనలో 57.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 50.2 మిల్లీమీటర్లు, పిఠాపురంలో 45.5 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.