LOADING...
Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు
600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు

Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్‌తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒక్కో హాస్టల్‌కు రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.15 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు కమిటీకి వివరించారు. అయితే ఈ నిధుల సమీకరణ బాధ్యతను తామే భుజాన వేసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో కమిటీ ఛైర్మన్‌ బీద రవిచంద్ర అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సభ్యులైన ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, కందికుంట వెంకటప్రసాద్, కాగిత ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వివరాలు 

కనీస సదుపాయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఆదేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న బీసీ సంక్షేమ వసతిగృహాల్లో కనీస వసతులు లేవన్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో అందుతున్నాయని కమిటీ అధికారులను ప్రశ్నించింది. తాగునీటి అవసరాల కోసం ఆర్వో ప్లాంట్లు, విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొనేందుకు ఇన్వర్టర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతున్నామని అధికారులు కమిటీకి తెలియజేశారు. అయితే ప్రతి వసతిగృహంలో ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేసి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. జిల్లా బీసీ భవన్‌ల విషయానికి వస్తే, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోనూ ఈ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని కమిటీ సూచించింది.

వివరాలు 

ప్రతినెలా జిల్లా పర్యటనకు బీసీ సంక్షేమ కమిటీ నిర్ణయం

అలాగే రెసిడెన్షియల్‌ పాఠశాలలకు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో వాటి సంఖ్య పెంచాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించింది. ప్రతినెలా ఒక జిల్లాలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తామని కమిటీ ఛైర్మన్‌ రవిచంద్ర వెల్లడించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. ఈ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నదానితో పాటు విశ్వవిద్యాలయాలు, విద్యుత్‌ సంస్థల్లో నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ విధానం పాటిస్తున్నారా అనే అంశాలనూ పరిశీలించి, లోపాలుంటే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు.

Advertisement