Venkaiah Naidu: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని వెంకయ్య నాయుడు కోరారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అప్పట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన సమక్షంలో అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగిన విషయాన్ని వెంకయ్య గుర్తుచేశారు.
వివరాలు
కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలి
అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2019 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఎదురైన సమస్యలను వివరించిన వెంకయ్య నాయుడు, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం వెంటనే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తన మంత్రిత్వ శాఖ స్థాయిలో అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇక మిగిలింది కేవలం కేంద్ర కేబినెట్ ఆమోదమేనని ఆయన చెప్పినట్లు వెంకయ్య నాయుడు వెల్లడించారు.