Loading...
Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

Revanth Reddy: ఆగస్టు 3 వరకు గాంధీభవన్‌కు రావొద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన జూమ్‌ సమావేశంలో కీలక సూచనలు చేశారు. పదవుల కోసం గాంధీభవన్‌కు వచ్చే నాయకులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలు గాంధీభవన్‌కు రావద్దని, క్షేత్రస్థాయిలోనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు నేతలు హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు.

వివరాలు

ఇప్పటివరకూ ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు

సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎస్‌ఐఆర్‌పై 489 సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇంకా వెనుకబడిన నియోజకవర్గాల నాయకులు ఇప్పటికైనా చురుకుగా స్పందించాలని సూచించారు.

ఛైర్మన్‌ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, అలాంటి వారి కోసం అపాయింట్‌మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకు తేల్చిచెప్పారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు బిజీగా ఉన్నప్పటికీ తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ పనులపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని సూచించారు.

ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు చేపట్టిన ప్రాంతాల్లో ఎంపీలు సమర్థంగా పనిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వివరాలు

ఇన్‌ఛార్జిలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలి

ఎస్‌ఐఆర్‌కు సంబంధించి పార్టీ ఇన్‌ఛార్జిలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని బీఎల్‌వోల నివేదికల కంటే బీఎల్‌ఏల (Booth Level Agents) నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

బీఎల్‌వోల రిపోర్టులపై మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను నాయకులు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలోనే ఉండాలని హైదరాబాద్‌లోనే తిరుగుతూ కాలం గడపడం సరికాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్‌కు నియమించిన పార్టీ ఇన్‌ఛార్జిలు తప్పనిసరిగా గ్రామస్థాయిలో పర్యటించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు

రాహుల్ గాంధీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తాం

ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించిన సీఎం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాలని కోరారు.

అంతేకాకుండా పార్టీ కోసం అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ADVERTISEMENT