Sonia Gandhi: సోనియా గాంధీకి మారుతి కంపెనీలో 50 శాతం వాటా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పౌరురాలిగా ఉన్నప్పటికీ ఆమెకు ఓ భారతీయ కంపెనీలో భారీగా వాటాలు ఉన్నాయని, ఆమె పేరు మీద భూమి కేటాయింపులు కూడా జరిగాయని ఆరోపించారు. శనివారం 'ఎక్స్' వేదికగా 'కాంగ్రెస్ చీకటి అధ్యాయం - చాప్టర్ 250' పేరుతో సుదీర్ఘ పోస్ట్ చేశారు. విదేశీ పౌరురాలైన సోనియా గాంధీ 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారని, అందులో ఆమెకు 50 శాతం వాటా ఉందని పేర్కొన్నారు.
వివరాలు
1970లో సంజయ్ గాంధీతో ఒప్పందం!
1970 నవంబర్ 21న సోనియా గాంధీకి చెందిన 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్'తో సంజయ్ గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారని నిషికాంత్ దూబే తెలిపారు.
మారుతి సంస్థకు అసలైన యజమాని సోనియా గాంధీనేనని వ్యాఖ్యానించారు. మారుతి సంస్థ 1970లో ఏర్పాటవగా, కార్ల తయారీకి సంబంధించిన లేఖ మాత్రం 1968లోనే ప్రభుత్వానికి చేరిందని పేర్కొన్నారు.
1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన కోడలు సోనియా నేతృత్వంలోని కంపెనీ కార్లు తయారు చేసేందుకు కేబినెట్ ఉత్తర్వులు ఇప్పించారా? అని ప్రశ్నించారు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయుడు భారతీయ సంస్థలో డైరెక్టర్‌గా ఉండకూడదని, అలాంటప్పుడు 1970లో సోనియా గాంధీ ఎలా డైరెక్టర్ అయ్యారని నిలదీశారు.
వివరాలు
సోనియా పేరు మీద భూమి ఎలా కేటాయించారు?
అప్పట్లో హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులకు భూమి కేటాయించే అవకాశం లేనప్పుడు సోనియా గాంధీ పేరు మీద భూమి ఎలా కేటాయించారని దూబే ప్రశ్నించారు.
ప్రధానమంత్రి కార్యాలయంలో ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయాన్ని ఎలా ప్రారంభించారని, ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ ధావన్ ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఎలా నియమితులయ్యారని నిలదీశారు.
ఎలాంటి సొంత పెట్టుబడి పెట్టకుండానే ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో సోనియా గాంధీ తన తాజా పుస్తకంలో వివరిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు.
ఈ వ్యవహారాలకు సంబంధించి 1979 నాటి జస్టిస్ ఏసీ గుప్తా కమిషన్ విచారణ నివేదికను కూడా నిషికాంత్ దూబే ప్రస్తావించారు.