
Bihar: బీహార్‌లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం! రాజకీయ దుమారం రేపిన ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో అధికారులు ఒక శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. పాట్నా జిల్లాలోని మాసౌర్హీ పట్టణానికి చెందిన అధికారులు "డాగ్ బాబు" అనే పేరుతో ఒక డిజిటల్ నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. ఈ సర్టిఫికేట్‌లో కుక్క తండ్రి పేరును "కుత్తా బాబు"గా,తల్లి పేరును "కుత్తియా దేవి"గా నమోదు చేసి, సంపూర్ణ చిరునామా వివరాలతో పాటు ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ఫొటోలో ఉన్నది ఓ శునకం అన్న సంగతి చూసుకోకుండా ప్రభుత్వం దానికి ఓ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీచేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈసంఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతూ,బీహార్ బీజేపీ పాలనలో పరిపాలనా వ్యవస్థలోని లోపాలను ఇది స్పష్టంగా బయటపెడుతోందని ఆరోపించాయి.
వివరాలు
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన స్వరాజ్ ఇండియా నాయకుడు
ఇటీవలి కాలంలో బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పెద్దఎత్తున వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు దీనిని ఓటు హక్కును అపహరించే కుట్రలో భాగంగా చూస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఇలాంటి సర్టిఫికేట్‌లు జారీ చేస్తూ బీహార్ ఓటర్ల సర్వేను నిర్వహిస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డుల వివరాలను పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఓటు హక్కును నిరాకరించే కుట్ర ఇది" అని ఆయన ఆరోపించారు.
వివరాలు
కుక్క రెసిడెన్స్ పత్రాన్ని రద్దు చేసిన పాట్నా జిల్లా యంత్రాంగం
ఇలా శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం కూడా రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పాట్నా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు ప్రారంభించింది. శునకానికి జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్‌ను అధికారికంగా రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ తప్పిదానికి బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. "తప్పిదానికి పాల్పడిన ఉద్యోగులు, అధికారులు డిపార్టుమెంట్ స్థాయిలో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది" అని ప్రకటనలో పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీహార్‌లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం
Only in Bihar a residence certificate is issued in the name of “Dog babu” with father’s name as “Kutta babu” pic.twitter.com/NRcO8pjXjU
— Marya Shakil (@maryashakil) July 28, 2025