Petroleum Ministry: దేశీయ LPG, పెట్రోల్,డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు: ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో సమీప భవిష్యత్తులో ఎలాంటి పెరుగుదల ఉండదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరగడంతో, దేశంలో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
వివరాలు
14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచే యోచన ప్రస్తుతం లేదు: ప్రభుత్వం
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులకు ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకే ఇంధనం అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచే యోచన ప్రస్తుతం లేదని పేర్కొంది. ఇక వాణిజ్య సిలిండర్ ధరలు స్వల్పంగా పెరిగినా,దాని ప్రభావం సాధారణ గృహ వినియోగదారులపై పడదని అధికారులు వివరించారు. వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగితే డొమెస్టిక్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతాయనే భావన పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రెండు నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దీంతో తక్షణంలో ధరల పెరుగుదలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.