
Gottipati Ravi Kumar: స్మార్ట్‌మీటర్లపై అపోహలు వద్దు.. ముందుగా ప్రజల అంగీకారం అవసరం!
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చే అంశంపై ప్రజల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లకూడదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు తేల్చిచెప్పారు. స్మార్ట్‌మీటర్ల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు పూర్తిగా వివరించి, వారు అంగీకరిస్తేనే అమలు చేయాలని స్పష్టంగా సూచించారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చే యోచన లేదని, ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార వర్గాలకే ఈ మీటర్లను అమర్చాలని తెలిపారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులతో విశాఖపట్నంలో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్‌మీటర్ల అమలులో విద్యుత్ శాఖ అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లలో ముందుగా అమర్చాలని సూచించారు.
Details
ప్రజల మద్దతు అవసరం
ప్రజల మద్దతు లేకుండా ఏ అంశంపైనా కూటమి ప్రభుత్వం ముందుకు పోదని మంత్రి స్పష్టం చేశారు. స్మార్ట్‌మీటర్లపై సామాజిక మాధ్యమాల్లో అపోహలు పుట్టించేవారి ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఈపీడీసీఎల్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ లైన్లకు సంబంధించి ఆర్డీఎస్‌ఎస్ పనులను వేగవంతం చేయాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌కు మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న లో వోల్టేజ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిం చాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విద్యుత్‌శాఖ సీనియర్ అధికారులు సీజీఎంలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు. అధికారుల వివరాల ప్రకారం, ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర విద్యుత్ అందజేస్తున్నట్లు మంత్రికి వివరించారు.