Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం.. ఎల్బీనగర్-హయత్‌నగర్‌కు డబుల్ డెక్కర్ కారిడార్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-హయత్‌నగర్ మధ్య భారీ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.941 కోట్ల వ్యయంతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, పరిసర ప్రాంతాల్లోని సుమారు 70 కాలనీల్లో నివసిస్తున్న 12 లక్షల మందికి ఉపశమనం లభిస్తుందని ఆయన చెప్పారు.
వివరాలు
భారీ రోడ్డు అభివృద్ధి ప్రణాళికలు
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు రూ.7,600 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అలాగే హ్యామ్ విధానంలో సుమారు రూ.20,000 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు.
వివరాలు
ఎల్బీనగర్-హయత్‌నగర్ కారిడార్ వివరాలు
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు సుమారు 5.50 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడతామని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చించనున్నాయి. ఈ ప్రతిపాదనలు ఈ నెల 17న కేంద్రానికి పంపగా ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. వచ్చే ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశముందని తెలిపారు.
వివరాలు
నగరంలోని ఇతర ప్రాజెక్టులు
పుణె-హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై మదీనాగూడ నుంచి భెల్ వరకు 1.20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ తుక్కుగూడ నుంచి మన్ననూర్ వరకు ఇప్పటికే ఆరు వరుసల రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్కడి నుంచి శ్రీశైలం వరకు సుమారు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
వివరాలు
హ్యామ్ విధానంలో భారీ టెండర్లు
హ్యామ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 6092.37 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి 34 ప్యాకేజీలలో 441 పనులకు రూ.13,006 కోట్లతో టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 24 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్ల పరిశీలన జరుగుతుండగా, మరో 10 ప్యాకేజీల టెండర్ ప్రక్రియ వారంలో పూర్తి కానుందని చెప్పారు.
వివరాలు
ఎమ్మెల్యేల డిమాండ్లు
ఎల్బీనగర్-హయత్‌నగర్ మధ్య ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పలు విద్యాసంస్థలు ఉన్నాయని, విద్యార్థులు రోడ్డు దాటడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తుక్కుగూడ నుంచి శ్రీశైలం వరకు రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని కూడా కోరారు. తాండూరు నియోజకవర్గంలోని బుడ్డారం,నాగులపల్లి రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరగా,పనామా ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి,మేఘారెడ్డి,నాగరాజు, మాణిక్‌రావు, వీర్లపల్లి శంకర్‌లు కూడా తమ తమ నియోజకవర్గాల్లోని రహదారి సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.