Delhi: ఢిల్లీలోని 40కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దాదాపు 40కి పైగా పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా ఈ తరహా బెదిరింపులు అందాయి. ఈ ఘటనకు స్పందించిన పోలీసులు ఆయా పాఠశాలల్లో దర్యాప్తు చేపట్టారు. జాగ్రత్త చర్యగా విద్యార్థులను ఇళ్లకు పంపించి, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ విహార్‌లోని జీడీ గొయెంకా పాఠశాలలకు సోమవారం ఉదయం బెదిరింపు ఈమెయిల్లు అందగా, మరికొన్ని పాఠశాలలకు ఈమెయిల్లు నిన్న రాత్రి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈమెయిల్లో పాఠశాలల ఆవరణల్లో పేలుడు పదార్థాలు అమర్చామని, వాటిని నివారించాలంటే 30,000 డాలర్లు చెల్లించాలని ఆగంతకులు బెదిరించినట్లు తెలిపారు.
పాఠశాలల్లో విస్తృత తనిఖీలు
ఈ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్యదళం సహకారంతో పాఠశాలల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈమెయిల్ పంపిన ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో పాఠశాలలపై పలు బాంబు బెదిరింపులు నమోదవ్వడం చర్చనీయాంశమైంది. గత అక్టోబరులో రోహిణి ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల వెలుపల జరిగిన బాంబు పేలుడు తీవ్ర కలకలాన్ని రేపిన విషయం గుర్తుచేయదగినది.