Page Loader
Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video) 
భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video)

Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్‌ కెమెరా (Video) 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల ఉగ్రవాదులపై చర్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం పుల్వామా జిల్లాలోని థ్రాల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అందులో ఒకరు ఓ నిర్మాణంలో పూర్తికాని భవనంలోని బేస్‌మెంట్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. అతని గుట్టు రట్టు చేయడానికి భద్రతా సిబ్బంది డ్రోన్ కెమెరా సహాయాన్ని తీసుకున్నారు. ఆ కెమెరాలో ఉగ్రవాది ఓ స్థంభం వెనక దాగినట్టు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత జరిగిన కూంబింగ్ ఆపరేషన్‌లో అతడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

వివరాలు 

 కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం 

ఈ ఘటనకు ముందు భద్రతా దళాలకు థ్రాల్‌లోని నదీర్ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందింది. వెంటనే వారు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఉగ్రవాదులు , భద్రతా బలగాలకి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గంటల తరబడి సాగిన ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి పేర్లు ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వనీ, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. వీరంతా పుల్వామా జిల్లాకు చెందినవారే. ఇదే సమయంలో,గత 48 గంటల వ్యవధిలో ఇదే రెండవ కీలక ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం.

వివరాలు 

గత ఏడాది ఏప్రిల్‌లో ఓ రిసార్ట్ వద్ద కాల్పులు 

నిన్న దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు లష్కరే తోయ్బా సంస్థకు చెందిన ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి. వారి పేర్లు షహీద్ కుట్టా,అద్నాన్ షఫీగా గుర్తించారు.ఇందులో షహీద్ 2023లో లష్కరే తోయ్బాలో చేరాడు. అతడు గత ఏడాది ఏప్రిల్‌లో ఓ రిసార్ట్ వద్ద జరిగిన కాల్పుల ఘటనకు ప్రధాన నిందితుడుగా గుర్తించబడ్డాడు. ఆ ఘటనలో ఇద్దరు జర్మన్ పర్యాటకులు, వారి డ్రైవర్ గాయపడ్డారు. అదే సమయంలో ఓ సర్పంచ్ హత్య కేసులోనూ అతడే ప్రధానంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కేసులోనూ అతడి పేరును పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు షహీద్‌కు చెందిన ఇంటిని పేల్చేశాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post