Mamata Banerjee: నా తమ్ముడితో అన్ని బంధాలను తెంచుకున్నా: మమతా బెనర్టీ
హౌరా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను నిలబెట్టకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు బాబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిలిగురిలో జరిగిన విలేకరుల సమావేశంలో తన తమ్ముడు బాబున్‌పై మమత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం బాబున్‌తో అన్ని సంబంధాలను తెంచుకున్నామన్నారు. అతనికి, తన కుటుంబానికి ఇకపై ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కుటుంబం మొత్తం అతనిపై ఆగ్రహంతో ఉందన్నారు. హౌరా లోక్‌సభ స్థానం నుంచి ప్రసూన్ బెనర్జీని మళ్లీ పార్టీ అభ్యర్థిగా మమతా ప్రకటించారు. దీంతో బాబున్ మమతపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. బీజేపీతో బాబున్ సన్నిహితంగా ఉంటున్నారన్న ఊహాగానాల నేపథ్యంలోనే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వతంత్ర అభ్యర్థిగా బాబున్ పోటీ
భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలను బాబున్ కొట్టిపారేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో హౌరా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. బాబూన్ బెనర్జీ ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. హౌరా లోక్‌సభ స్థానానికి అభ్యర్థి ఎంపిక పట్ల తాను సంతోషంగా లేననని బాబూన్ బెనర్జీ స్పష్టం చేశారు. ప్రసూన్ బెనర్జీ సరైన ఎంపిక కాదన్నారు. ప్రసూన్ బెనర్జీ తనకు చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ప్రసూన్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు రెండోసారి హౌరా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మూడోసారి టీఎంసీ ఆయనకే టికెట్ కేటాయించింది.