Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు
ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక నర్సు భారతదేశంలో నివసిస్తున్న తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతుండగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడిలో గాయపడినట్లు సమాచారం. ఏడేళ్లుగా ఇజ్రాయెల్‌లో ఉన్న షీజా ఆనంద్ (41), శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని ప్రారంభించిన సమయంలో తన క్షేమ సమాచారాలను తెలపడానికి ఆమె భారతదేశంలోని తన భర్తకు కాల్ చేసింది. ఈ సమయంలో భయంకరమైన పెద్ద శబ్ధంతో కాల్ అకస్మాత్తుగా కట్ అయింది. అనంతరం తోటి కేరళీయుడు ఆనంద్ కుటుంబానికి ఆమె గాయపడిందని, శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం అందించాడు. మరో సర్జరీ కోసం ఆనంద్‌ని మరో ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపాడు.
బెత్లెహెమ్‌హోటల్‌లో చిక్కుకుపోయిన కేరళకు చెందిన 200మంది
ఆనంద్ భర్త,ఇద్దరు పిల్లలు ఇండియాలో ఉన్నారు. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలావుండగా, కేరళకు చెందిన 200 మందికి పైగా బెత్లెహెమ్‌లోని ఒక హోటల్‌లో చిక్కుకుపోయి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. మాస్‌కు హాజరవుతున్నప్పుడు ఎయిర్ రైడ్ సైరన్‌లు వినిపించాయని గ్రూపు సభ్యుల్లో ఒకరైన జాయ్ చెప్పినట్లు మలయాళ వార్తాపత్రిక మాతృభూమి నివేదించింది. వారి షెడ్యూల్ ప్రకారం, వారు సోమవారం ఈజిప్ట్ బయలుదేరాల్సి ఉంది.కానీ యుద్ధ మేఘాలు కమ్ముకోడంతో బెత్లెహెమ్‌లోని హోటల్ వారిని ప్రస్తుతానికి అక్కడే ఉండవలసిందిగా కోరారు.
ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు
కొచ్చికి చెందిన మరో 45 మంది పాలస్తీనాలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం. మాతృభూమి ప్రకారం,వారంతా సురక్షితంగా ఉండడమే కాకుండా వారికి సరిహద్దు దాటేందుకు అనుమతి కూడా లభించింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లకు ఇజ్రాయెల్‌లో పరిస్థితిని వివరించారు. మూడు రోజుల పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు.