Andhra Pradesh: చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల ప్రారంభంపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఏవియేషన్, డిఫెన్స్ తయారీ రంగాల్లో సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై వారు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. రక్షణ రంగంలో తమకు ఉన్న అనుభవం,సాంకేతిక నైపుణ్యాలు,ఇప్పటివరకు సాధించిన విజయాలను వారు వివరంగా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అలాగే రక్షణ ,ఏరోస్పేస్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విస్తృత అవకాశాల గురించి ముఖ్యమంత్రి వారికి వివరణ ఇచ్చారు.
వివరాలు
పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పెట్టుబడులకు అనుకూల వాతావరణం, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి సంస్థ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉదయంత్ మల్హోత్రా, ఏరోస్పేస్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్,హెడ్ పి. చలపతి, డైరెక్టర్ అహిత్యా మల్హోత్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రియా మిలానీ, యూరప్ వ్యాపార కార్యకలాపాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టినా లిడేగార్డ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.