హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ప్రారంభించనుంది. ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) బస్సులకు 'ఈ-గరుడ' అని పేరు పెట్టారు. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 50 ఈవీ బస్సు సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడత కింద 10బస్సులను నడపనున్నారు. మిగిలిన 40 ఈవీ బస్సులు ఈ ఏడాది చివరి నాటికి దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ ప్రయోజనాలతో పాటు, ఈవీ బస్ ఫ్లీట్ విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయాణీకులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
ప్రతి 20 నిమిషాలకు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు సోమవారం తెలిపారు. రానున్న రెండేళ్లలో 1860 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో హైదరాబాద్ నగరంలో 1300 బస్సులు, మిగిలిన 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపనున్నట్లు కార్పొరేషన్ తెలిపింది. అలాగే రాబోయే నెలల్లో హైదరాబాద్‌లో మొత్తం 10 డబుల్ డెక్కర్ బస్సులు నడవనున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం మంగళవారం మియాపూర్ క్రాస్ రోడ్స్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో జరగనుంది.