Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయలో కూడా ప్రకంపనలు
ఈ వార్తాకథనం ఏంటి
సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు అసోం రాష్ట్రంలోని మోరిగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ ప్రకారం భూకంపం తీవ్రత 5.1గా నమోదయింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ (ఎన్‌సీఎస్) ధృవీకరించింది. ఎన్‌సీఎస్ నివేదిక ప్రకారం, ఈ భూకంపం భూమిలో 50 కిలోమీటర్ల లోతులో జరిగింది. అసోంలోని అనేక జిల్లాలతో పాటు మేఘాలయలోని షిల్లాంగ్ వరకు కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం నేపథ్యంలో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని తెలుస్తోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
వివరాలు
నేపాల్ని వణికించిన భూకంపాలు..
అంతకుముందు, సోమవారం తెల్లవారుజామున 3:03 గంటలకు త్రిపురా రాష్ట్రంలోని గోమటి ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. దీనికి రిక్టార్ స్కేల్ ప్రకారం తీవ్రత 3.9గా నమోదయింది. మరోవైపు, జనవరి 3న నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 6:13 గంటలకు పశ్చిమ నేపాల్‌లోని తప్లేజంగ్ జిల్లాలో 4.6 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా, శనివారం రాత్రి 10:36 గంటలకు తూర్పు నేపాల్‌లోని ఉదయాపుర్ జిల్లాలో కూడా భూకంపం నమోదయింది. దీనికి రిక్టార్ స్కేల్ ప్రకారం తీవ్రత 4.3గా ఉంది. ఈ నేపాల్ భూకంపాల వల్ల కూడా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు.