Page Loader
దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దిల్లీ- ఎన్సీఆర్‌లో 5.8 తీవ్రతతో భూకంపం

దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు

వ్రాసిన వారు Stalin
Jan 24, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలోని నేపాల్‌లో భూకంపం కేంద్రీకృతమైనట్లు, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. మధ్యాహ్నం 2.28 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్లు ఎన్ఎస్ఎఫ్‌సీ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో దిల్లీ- ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరభారతంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు వెల్లడించింది.

భూకంపం

ఒక్క జనవరి నెలలోనే ఇది మూడో భుకంపం

భూకంపం సమయంలో దాదాపు 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూమి కంపించే సమయంలో ఇళ్లలోని వస్తువులు కదిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దిల్లీలో భూమి కంపించడం ఒక్క జనవరి నెలలోనే ఇది మూడోసారి కావడం గమనార్హం.