Araku Utsav: తూర్పు తీరాన్ని ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక గమ్యంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో జరుగుతున్న పర్యాటక ఉత్సవాలను రాబోయే రోజుల్లో ఆసియాలోనే అతి పెద్ద ఉత్సవాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గురువారం నిర్వహించిన 'అరకు ఉత్సవ్-2026'ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగానే అరకు, అనకాపల్లి ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. లంబసింగిలో రాష్ట్రంలో తొలిసారిగా రూ.6.5 కోట్ల వ్యయంతో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రూ.5 కోట్లతో కారవాన్ పార్కులు, రూ.1.23 కోట్లతో హోంస్టేలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ఆంధ్రుల ఆతిథ్యం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే కొత్త చిరునామా
గతంలో పర్యాటకం అంటే విలాసవంతమైన హోటళ్లు, రెస్టారెంట్లకే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించిందన్నారు. ఆంధ్రుల ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే కొత్త చిరునామాగా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్సవాల పేరిట ప్రభుత్వం కోట్ల రూపాయలు వృథా చేస్తోందని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఘాటుగా స్పందించారు. వైకాపా పాలనలో గంజాయి సాగు పెరిగితే, కూటమి ప్రభుత్వం ఘుమఘుమలాడే అరకు కాఫీ సాగును ప్రోత్సహిస్తోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీడీసీ ఛైర్మన్ బాలాజీ, శ్రావణ్‌కుమార్, కోట్ని బాలాజీ, దొన్నుదొర తదితరులు పాల్గొన్నారు.