LOADING...
Ebola: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఎబోలా వైరస్‌ అనుమానిత కేసులు వెలుగుచూడటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎబోలా తరహా లక్షణాలతో ముగ్గురు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరడంతో వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన అధికారులు వారిని ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఎబోలా ప్రాథమిక లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిని సంప్రదించారు. వారి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మరింత పరీక్షల కోసం వారిని గాంధీ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. దీంతో ఇప్పటికే చికిత్స పొందుతున్న మరో వ్యక్తితో కలిపి గాంధీ ఆసుపత్రిలో ఎబోలా అనుమానితుల సంఖ్య మూడుకు చేరింది.

వివరాలు 

సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి ఎయిర్‌పోర్ట్‌లోనే గుర్తింపు

ప్రాథమిక విచారణలో ఈ ముగ్గురు ఒకే అంతర్జాతీయ విమానంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ విమానంలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించి వారిపై కూడా నిఘా పెట్టే చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, గురువారం సూడాన్‌ నుంచి ఇథియోపియా మీదుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 30 ఏళ్ల వ్యక్తిని విమానాశ్రయ వైద్య బృందం గుర్తించింది. థర్మల్‌ స్క్రీనింగ్‌లో అతడికి 100 డిగ్రీల జ్వరం ఉన్నట్లు తేలింది. ఇటీవల ఎబోలా ప్రభావం ఉన్న ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాలకు అతడు వెళ్లివచ్చినట్లు సమాచారం అందడంతో, ముందస్తు జాగ్రత్త చర్యగా అతడిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు.

వివరాలు 

నిర్ధారణ కోసం నమూనాలను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిన అధికారులు

ప్రస్తుతం ముగ్గురు అనుమానితుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఎబోలాకు సంబంధించిన తీవ్రమైన లక్షణాలైన రక్తస్రావం,తీవ్రమైన వాంతులు వంటి సమస్యలు ఇప్పటివరకు ఎవరిలోనూ కనిపించలేదని స్పష్టం చేశారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు ఇప్పటికే అమలు చేస్తున్నామని ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.

Advertisement