
Rahul Gandhi: 'బీజేపీతో ఈసీ పొత్తు పెట్టుకుంది'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బీహార్‌లో SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' ఆదివారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. పూర్ణియాలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, విఐపి అధినేత ముఖేష్ సాహ్ని, CPI(ML) నాయకుడు దీపాంకర్ భట్టాచార్య, జన ఆదికారీ పార్టీ అధినేత పప్పు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల కమిషన్‌ను లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Details
ఈసీ సమాధానం చెప్పలేదని రాహుల్ ఆరోపణ
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ (EC) బీజేపీతో పొత్తు కలిగి ఉందని ఆరోపించారు. తన ప్రశ్నలకు ఈసీ ఇప్పటివరకు ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదని విమర్శించారు . కర్ణాటకలో కొత్తగా లక్ష మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నకు కూడా ఈసీ స్పందించలేదని గుర్తుచేశారు. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ నకిలీ ఓటర్లను చేర్చారని బహిరంగంగా మాట్లాడినా, ఆయనపై అఫిడవిట్ అడగలేదని, కానీ తన దగ్గర మాత్రం అఫిడవిట్ కోరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఎవరి వైపు ఉందో మీడియా సహా అందరికీ స్పష్టమైందన్నారు. బీహార్‌లో తన యాత్ర కారణంగా ప్రతి ఒక్కరూ రాజకీయంగా చురుకుగా మారారని తెలిపారు.
Details
ఓట్ల చోరీ జరగనివ్వమని హెచ్చరిక
బీహార్‌లో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని రాహుల్ తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం తమ యాత్ర ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. బీహార్‌లోని కోట్లాది మంది తమ మాట వింటున్నారని, ఓట్ల దొంగతనం గురించి తాము చెప్పిన విషయాలు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ కర్తవ్యం సరైన ఓటర్ల జాబితాను అందించడం కానీ, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో అది చేయలేదని మండిపడ్డారు. అక్కడ ఓట్ల దొంగతనం జరిగిందని నిరూపించామని, కానీ బీహార్‌లో మాత్రం అలాంటి పరిస్థితిని జరగనివ్వబోమని గట్టిగా చెప్పారు.
Details
ఈసీ బీజేపీ పార్టీ సెల్‌గా మారిందని తేజస్వి
ఈ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈసీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ సెల్‌లా, ఆ పార్టీ కార్యకర్తలాగే వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు, ప్రజల ఉనికిని కాపాడటానికి రాహుల్ గాంధీతో కలిసి ఈ యాత్రను ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రయాణం ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమైందని, బీహార్‌లో ఓట్ల చోరీ జరగనివ్వమని తేల్చి చెప్పారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని తేజస్వి మండిపడ్డారు.