Loading...
Andhra Pradesh: ఓటర్ల జాబితాలో పేరు మిస్సయ్యిందా? అక్టోబర్‌ 8 నుంచి మరోసారి వెరిఫికేషన్
ఓటర్ల జాబితాలో పేరు మిస్సయ్యిందా? అక్టోబర్‌ 8 నుంచి మరోసారి వెరిఫికేషన్

Andhra Pradesh: ఓటర్ల జాబితాలో పేరు మిస్సయ్యిందా? అక్టోబర్‌ 8 నుంచి మరోసారి వెరిఫికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా తొలగించిన, అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 8 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. బూత్‌ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి సంబంధిత ఓటర్ల వివరాలను తిరిగి తనిఖీ చేయనున్నారు. అర్హత ఉన్న ఓటరు పేరు పొరపాటున తొలగించినట్లు తేలితే.. కొత్తగా ఓటు నమోదు కోసం ఫారం-6 దరఖాస్తును నింపిస్తారు. అవసరమైన పరిశీలన పూర్తయిన తర్వాత వారి పేర్లను ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

ఏఎస్‌డీడీ జాబితాలోని ఓటర్లకు మరోసారి పరిశీలన

SIR ప్రక్రియలో భాగంగా జూన్‌ 15 నుంచి జులై 24 వరకు BLOలు ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓటర్లు ఇచ్చిన చిరునామాల్లో అందుబాటులో లేని వారు,శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారు,మరణించిన వారు,ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్న వారు తదితరులను గుర్తించారు.

ఈ కేటగిరీల్లో మొత్తం 44,89,512మంది ఉన్నట్లు తేలింది.వీరిని ఆబ్సెంటీ,షిఫ్టెడ్‌, డెత్స్‌,డబుల్‌ ఎంట్రీగా(ASDD)గుర్తించి,వారి పేర్లను తొలగిస్తూ జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.

ఆ జాబితాలో మొత్తం 3,71,38,182 మంది ఓటర్లు ఉన్నారు.

ముసాయిదా జాబితాలో ఉన్న కొందరు ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్‌ పత్రాల్లో వివరాలు సరిగా లేకపోవడం,అవసరమైన సమాచారం ఇవ్వకపోవడం వంటి కారణాలతో 44,28,845మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

వివరాలు 

ఏఎస్‌డీడీ జాబితాలోని ఓటర్లకు మరోసారి పరిశీలన

విచారణ అనంతరం 1,73,071 మందిని ఓటర్లుగా చేర్చేందుకు అనర్హులుగా గుర్తించారు.

అక్టోబర్‌ 16న విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో ఈ పేర్లను చేర్చకూడదని నిర్ణయించారు.

అయితే అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితాలో లేకుండా పోకూడదన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ పునఃపరిశీలనకు ఆదేశించింది.

దీంతో ముందుగా ASDD కేటగిరీలో తొలగించిన 44,89,512 మంది వివరాలతో పాటు, ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అనర్హులుగా గుర్తించిన 1,73,071 మంది వివరాలను కూడా మరోసారి పరిశీలించనున్నారు.

ఈ ప్రక్రియను BLOలు ఇంటింటికీ వెళ్లి చేపట్టనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

అర్హులకు ఫారం-6తో అవకాశం

అక్టోబర్‌ 16న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు కూడా తర్వాత ఓటు హక్కు పొందేందుకు అవకాశం ఉంటుంది.

అలాగే 2027 జనవరి 1, ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే యువత నుంచి ఆయా తేదీలకు అనుగుణంగా ఫారం-6 దరఖాస్తులు స్వీకరించాలని ఎన్నికల సంఘం సూచించింది.

అర్హత నిర్ధారణ అనంతరం వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పునఃపరిశీలనపై వీడియోలు పోస్టు చేయాలి

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలకు ముందు తొలగించిన పేర్లు, అలాగే నోటీసులు ఇచ్చి విచారణ అనంతరం అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను BLOలు పునఃపరిశీలించే సమయంలో వారి అనుభవాలను వీడియోల్లో రికార్డు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

జిల్లా ఎన్నికల అధికారులు, అంటే కలెక్టర్లు, ఈ ప్రక్రియను పర్యవేక్షించాలి.

కొత్తగా ఓటు హక్కు పొందిన యువ ఓటర్ల అభిప్రాయాలను కూడా వీడియోల రూపంలో నమోదు చేయాలని సూచించింది.

అలాగే క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, నోటీసుల ప్రక్రియ సజావుగా సాగిందని తెలిపే ఓటర్ల అభిప్రాయాలను వీడియోలుగా చిత్రీకరించాలని పేర్కొంది.

ముసాయిదా జాబితాలో పేరు తొలగిపోయినప్పటికీ, నోటీసుల దశ తర్వాత తిరిగి ఓటు హక్కు పొందిన వారి స్పందనలను కూడా రికార్డు చేయాలని సూచించింది.

వివరాలు 

రోజూ ఫొటోలు, వీడియోలు పోస్టింగ్

జిల్లా ఎన్నికల అధికారులు తమ సామాజిక మాధ్యమ ఖాతాలను వెంటనే క్రియాశీలం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రోజుకు కనీసం రెండు ఫొటోలు, రెండు వీడియోలను ఆయా ఖాతాల్లో పోస్టు చేయాలని సూచించారు.

ఈ పోస్టుల్లో సీఈవో, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సామాజిక మాధ్యమ ఖాతాలను ట్యాగ్‌ చేయాలి.

ప్రతి పోస్టుతో పాటు సంబంధిత ఓటరు పోలింగ్‌ స్టేషన్‌, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా వివరాలను స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు.

ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో నమోదు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ చర్యల ఉద్దేశం.

ADVERTISEMENT